---Advertisement---

చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై 7 ప్ర‌శ్న‌లు

బడ్జెట్ సంఖ్యల్లో దాగిన నిజాలు ఏమిటి..? చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురైన ఏడు కీలక ప్రశ్నలు
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంఖ్యలే ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. ఆదాయం వృద్ధి వాస్తవంగా 3.4% మాత్రమే ఉండగా, బడ్జెట్‌లో మాత్రం 45% పెరుగుదల చూపడం ఎలా సాధ్యమైందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో రూ.67,459 కోట్లు మాత్రమే వచ్చిన ఆదాయం, మిగిలిన 3 నెలల్లో రూ.44,407 కోట్లు వస్తుందని అంచనా వేయడం వాస్తవిక ఆర్థిక ప్రణాళికేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఈ 7 ప్ర‌శ్న‌లు వేస్తున్నాం.

1) ఆదాయం 3.4% మాత్రమే పెరిగితే.. 45% పెరుగుదల ఎలా చూపించారు?
రాష్ట్ర ఆదాయం వాస్తవంగా కేవలం 3.4% మాత్రమే పెరిగిన పరిస్థితిలో, వచ్చే ఏడాదికి 45% వృద్ధి చూపడం ఏ ఆర్థిక లెక్కల ఆధారంగా జరిగిందో ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉంది. తొలి 9 నెలల్లో రూ.67,459 కోట్లు మాత్రమే వచ్చిన ఆదాయం, మిగిలిన 3 నెలల్లో రూ.44,407 కోట్లు వస్తుందని అంచనా వేయడం వాస్తవికతకు దూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైన ఆదాయ అంచనా లేకుండా బడ్జెట్ తయారైందా అనే అనుమానాలకు దారి తీస్తోంది.

2) మొత్తం బడ్జెట్ రూ.3.32 లక్షల కోట్లు .. రాష్ట్ర అసలు అప్పు ఎంత?
బడ్జెట్ పరిమాణం రూ.3,32,205 కోట్లు, ఇందులో రూ.2,34,140 కోట్లు రెవెన్యూ, రూ.98,065 కోట్లు అప్పు అని చెప్పిన ప్రభుత్వం, రాష్ట్ర మొత్తం అప్పు ఎంత ఉందో స్పష్టంగా ఎందుకు వెల్లడించలేదన్న ప్రశ్న ముందుకు వస్తోంది. అధికారంలోకి రాకముందు భారీ అప్పుల ఆరోపణలు చేసిన కూటమి నాయకత్వం ఇప్పుడు అసలు సంఖ్య చెప్పకుండా మౌనం పాటించడం వెనుక కారణమేంటన్నది రాజకీయ చర్చగా మారింది.

3) మూలధన వ్యయం లక్ష్యాలు వాస్తవమా?
2025-26లో మూలధన వ్యయం రూ.40,635 కోట్లుగా చూపించి, తర్వాత రూ.33,134 కోట్లుకి తగ్గించిన ప్రభుత్వం, తొలి 9 నెలల్లో రూ.19,224 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన మూడు నెలల్లో భారీగా ఖర్చు చేసి లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా సాధ్యం? అదే సమయంలో వచ్చే ఏడాదికి రూ.48,075 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం వాస్తవిక అభివృద్ధి ప్రణాళికేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

4) అప్పుల లెక్కల్లో వ్యత్యాసం ఎందుకు?
తొలి 9 నెలల్లో రూ.81,597 కోట్లు అప్పు చేసినప్పటికీ, మొత్తం ఏడాదికి రూ.80,500 కోట్లు మాత్రమే అప్పు చూపించడం ఏంటి? 2024 జూన్ తర్వాత మొత్తం అప్పులు రూ.3.20 లక్షల కోట్లు దాటినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వివిధ సంస్థల ద్వారా తీసుకున్న ఆఫ్-బడ్జెట్ అప్పుల వివరాలు ప్రభుత్వం ఎందుకు వెల్ల‌డించ‌లేదు ప్ర‌శ్న తీవ్రంగా వినిపిస్తోంది.

5) ఎన్నికల హామీలకు నిధులు ఎక్కడ?
నిరుద్యోగ భృతి కోసం సంవత్సరానికి రూ.7,200 కోట్లు, మహిళల ఆర్థిక సహాయం కోసం రూ.32,400 కోట్లు, 50 ఏళ్లు పైబడిన వర్గాలకు రూ.9,600 కోట్లు అవసరమని లెక్కలు చెబుతున్నాయి. కానీ బడ్జెట్‌లో ఈ హామీలకు తగిన కేటాయింపులు కనిపించకపోవడం ఎన్నికల వాగ్దానాల అమలుపై సందేహాలు కలిగిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక ఉందా లేదా అన్నది ప్రభుత్వం చెప్పాల్సిన అంశంగా మారింది.

6) సంక్షేమ పథకాల కేటాయింపుల్లో కోత ఎందుకు?
“తల్లికి వందనం” పథకానికి అవసరమైన రూ.13,112 కోట్లు కంటే తక్కువ కేటాయింపులు, “దీపం” పథకానికి అవసరమైన రూ.4,083 కోట్లుకు పోలిస్తే తక్కువ నిధులు చూపించడం సంక్షేమంపై ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గిందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. రైతులకు ప్రకటించిన సహాయంలో కూడా వేల కోట్ల తేడా ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, సంక్షేమం నిజంగా అమలవుతోందా లేక కాగితాలకే పరిమితమైందా అన్న సందేహం పెరుగుతోంది.

7) బడ్జెట్ నిజంగా ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుందా?
ఆదాయం, ఖర్చులు, అప్పులు, హామీలు — ప్రతి అంశంలో వ్యత్యాసాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా ప్రతిబింబిస్తున్నదా లేక అంచనాలపై ఆధారపడిన పత్రంగా మారిందా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. సంఖ్యలతోనే మాట్లాడే బడ్జెట్‌లో సంఖ్యలే సందేహాలు రేకెత్తిస్తే, ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించి నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment