---Advertisement---

ఆరోగ్య‌రంగంపైనా చిన్న‌చూపేనా!

ఆరోగ్యరంగంపై నిర్లక్ష్యమేనా..? బడ్జెట్‌లో దాగిన కఠిన వాస్తవాలు ఏమిటి?
---Advertisement---

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్ర‌భుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించ‌లేక‌పోతోంది. ఇటీవ‌ల చాలా మంది వైద్యం అంద‌క చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు కూడా చూశాం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ప్ర‌వేశ‌పెట్టే మూడో బ‌డ్జెట్‌లో అయినా ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆ రంగాన్ని బ‌లోపేతం చేస్తార‌నుకుంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈసారి కూడా నిర్ల‌క్ష్య‌మే చేసింది. నిధుల కేటాయింపులో చిన్న చూపు చూసింది.

ఆరోగ్య శాఖ బడ్జెట్‌లో కోతలు
2025–26 బడ్జెట్‌లో రూ.19,264 కోట్లకు పైగా కేటాయించినట్టు ప్రకటించిన ప్రభుత్వం ఖర్చుల్లో రూ.1,626 కోట్ల మేర కోత పెట్టిన విషయం సవరించిన బడ్జెట్‌లో స్పష్టమైంది. 2026–27 బడ్జెట్‌కు వైద్య శాఖ రూ.20 వేల కోట్లకు పైగా అవసరమని ప్రతిపాదించినప్పటికీ, ప్రభుత్వం రూ.19,306 కోట్లకే పరిమితం చేసింది. గత ఏడాది కోతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది కూడా ఖర్చుల్లో తగ్గింపులు ఉంటాయన్న భయం అంద‌రితో వ్య‌క్త‌మ‌వుతోంది.

మందులు, సర్జికల్స్‌కు అరకొర నిధులు
రాష్ట్రంలోని ఆసుపత్రులకు మందుల కొనుగోళ్లకు రూ.820 కోట్లకు పైగా అవసరమని అధికారులు ప్రతిపాదించగా, రూ.600 కోట్లే కేటాయించారు. సర్జికల్స్‌ కోసం రూ.320 కోట్లు అవసరమని చెప్పినా, రూ.100 కోట్లకు పైగా కోత విధించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సామాన్యుల‌కు నాణ్య‌మైన వైద్యం ఎలా అందుతుంది?

ఆరోగ్య ఆసరా పథకానికి ‘సున్నా’
వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా పథకానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులే లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులు కోలుకునే సమయంలో ఆర్థిక సహాయం అందించే ఈ పథకానికి ఏటా రూ.450 కోట్లకు పైగా అవసరం. ఇప్పటికే రెండు సంవత్సరాల్లో రూ.900 కోట్లకు పైగా సాయం నిలిచిపోయింది. అయినా ఈ ప్ర‌భుత్వంలో ఎలాంటి చ‌ల‌నం లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. గతంలో 2019–24 మధ్య వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం 24,59,090 మందికి రూ.1,465.67 కోట్ల సాయం అందించింది.

ఆరోగ్యశ్రీ బకాయిల భారం
ఆరోగ్యశ్రీ చికిత్స అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి ఉందని ఆస్పత్రుల యాన‌మాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించినప్పటికీ, బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వ‌క‌పోవ‌డంతో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.

కొత్త వైద్య కళాశాలలపై అనిశ్చితి
2026–27 బడ్జెట్‌లో కొత్త వైద్య కళాశాలల ప్రస్తావనే లేకపోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన క‌లిగిస్తోంది. గత ప్రభుత్వంలో రూ.8,480 కోట్ల అంచనాలతో 17 కళాశాలలు ప్రారంభించగా, ఇప్పటికే రూ.3 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. పీపీపీ విధానంపై ప్రభుత్వ నిర్ణయాల వల్ల రెండు సంవత్సరాల్లో 2,450 ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పావాల్సిన దుస్థితి నెల‌కొంది.

ఆరోగ్య రంగానికి తగ్గిన ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతున్నప్పటికీ, రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం కేవలం 5.8 శాతం మాత్రమే కేటాయించారని నిపుణులు అంటున్నారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడేలా నిధులు తగ్గించడం పేద ప్రజలకు తీవ్ర నష్టం కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment