రాష్ట్రంలో పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చే దానికంటే ఎక్కువ ఇస్తానని, లబ్ధిదారుల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోతానని, ఏ ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి పింఛన్ అందక పోయే ప్రసక్తే లేకుండా చూస్తానని చెప్పారు. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అంతే కాదు పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోందని వాళ్లు వీళ్లు చెప్పడం కాదు, ప్రతిపక్షం విమర్శంచడం అంతకంటే కాదు, వాళ్లు చూపిస్తున్న లెక్కలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 66,34,372 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్య 60,96,108కు పడిపోయింది. అంటే కేవలం రెండు సంవత్సరాల్లోనే 5,38,634 మంది జాబితా నుంచి తప్పించారు. అంటే అన్ని లక్షల మందికి పింఛన్ కట్ అనే కదా అర్థం.
ఫిబ్రవరిలో పంపిణీ చేసిన పింఛన్లకు రూ.2,632 కోట్లు ఖర్చయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏడాది మొత్తం అవసరమయ్యే మొత్తం రూ.31,554 కోట్లు ఉండాలి. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. అంటే బడ్జెట్ కేటాయింపులు కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే విధంగానే ఉన్నాయి.
దీని అర్థం ఏమిటంటే, ఇప్పటికే లక్షల మంది పింఛన్లు కోల్పోయిన పరిస్థితిలో, ఈ ఏడాదిలోనే మరో 7,45,993 మందికి పింఛన్లు నిలిపివేయబడే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. సామాజిక భద్రత పథకాలు ప్రభుత్వ బాధ్యతలో కీలకమైనవి కాగా, వాటిలో కోతలు పెట్టడం వృద్ధులు, వికలాంగులు, విధవలు వంటి బలహీన వర్గాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనాధారం కోల్పోయే పరిస్థితి వస్తే వారి కుటుంబాలపైనా భారమవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వైయస్ జగన్ ప్రభుత్వ కాలంలో లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ పింఛన్ మొత్తాలను కూడా పెంచామని అప్పటి అధికారులు చెబుతుంటే, ప్రస్తుతం మాత్రం తగ్గుదల కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చి, అమలులో కోతలు పెట్టడం ప్రజల్లో అసంతృప్తి పెంచుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తున్నదని నివేదికలు చెబుతున్నాయి.






