ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు రాష్ట్రం భారీ అప్పుల భారంలో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండగా, మరోవైపు ప్రజా ధనంతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం, ఐక్యత కోసం క్రీడలు అవసరమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, ప్రతిపక్షాలు మరియు సామాజిక వర్గాలు మాత్రం ఇది “ప్రజా ధన దుర్వినియోగం” అని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందని అధికారులే చెప్పుకుంటున్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు వెచ్చించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.
శ్రీకాకుళంలో డయేరియా మృతులు
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాప్తి వల్ల పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. తాగునీటి కలుషితం, పారిశుద్ధ్య లోపాలు కారణంగా వ్యాధి వ్యాప్తి చెందిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించాల్సింది పోయి, క్రీడా పోటీల్లో నిమగ్నమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాణాలు తీస్తున్న కల్తీ పాలు
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ప్రజలు అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు కూడా బయటపడుతున్నాయి. ఆహార భద్రతపై పర్యవేక్షణ లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.
అప్పుల్లో రాష్ట్రం..
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే భారీ అప్పులతో నడుస్తోందని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదని చెప్పే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల క్రీడోత్సవాలకు ఖర్చు పెట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “రాష్ట్రం అప్పుల్లో ఉంటే ప్రజల సమస్యలు ముందుగా పరిష్కరించాలి గానీ, రాజకీయ వేడుకలు ఎందుకు?” అనే ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
ప్రజా ప్రతినిధుల క్రీడలు తప్పు కాదు. కానీ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో ప్రాధాన్యతలు ప్రజల పక్షాన ఉండాలి కానీ.. ఇలా ప్రజా ధనం దుర్వినియోగం చేయడంలో కాదు.






