కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి దాదాపు 20 మంది వరకు సజీవ దహనం అయినట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో యూనిట్‌లో సుమారు 35 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్న సమాచారం. పేలుడు తీవ్రత అంతలా ఉండటంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పేలుడు శబ్దం దూర ప్రాంతాల వరకూ వినిపించగా, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు అంటున్నారు.
బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, భద్రతా పరికరాలు, కార్మికుల రక్షణపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే ప్రాణ నష్టానికి కారణమని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడం, భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కనీసం ఈ విషాదం తర్వాత అయినా ప్రభుత్వం మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






