ఒకప్పుడు కార్యకర్తలే బలం, కేడరే ఆస్తి అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడిన సొంత కార్యకర్తలకే గౌరవం లేకుండా పోయిందనే విమర్శలు నియోజకవర్గాల స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన కేడర్‌కు నిరాశే ఎదురవుతోందని పార్టీ అంతర్గత వర్గాలే అంటున్నాయి.
ఎన్నికల సమయంలో ప్రాణాలు పెట్టి పని చేసినవాళ్లను పక్కనబెట్టి, సంబంధమే లేని మధ్యవర్తులు, దళారులు అధికారానికి దగ్గరయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ పేరు చెప్పినా ప్రయోజనం లేకుండా, డబ్బు ఉన్నవారికి మాత్రమే పనులు జరుగుతున్నాయనే అసంతృప్తి కేడర్‌లో పెరుగుతోంది. దీంతో “మనమే పార్టీ కోసం పని చేశామా? లేక ఎవరికోసం?” అనే ప్రశ్నలు కార్యకర్తల మధ్య చర్చకు వస్తున్నాయి.
ఇంకా కొన్ని చోట్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో నాయకత్వం సొంత శ్రేణులను పట్టించుకోకుండా, ఆర్థిక లాభాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ఖర్చులు తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ ధోరణి కారణంగా పార్టీ కోసం నిజంగా పని చేసినవాళ్లు పక్కన పడుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
టీడీపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కేడర్ బేస్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం కార్యకర్తలపై ఆధారపడి ఉండేది. అయితే ప్రస్తుతం ఆ బలమైన సంబంధం బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు ఒకవైపు… కేడర్ మరోవైపు అనే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
గతంలో సాదాసీదా కార్యకర్త కూడా అధికార కార్యాలయంలోకి వెళితే గౌరవం దక్కేదని పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం అదే కార్యకర్త నిర్లక్ష్యానికి గురవుతున్నాడనే భావన పెరిగింది. పార్టీ సిద్ధాంతాలు, నిబద్ధత కంటే ఆర్థిక ప్రయోజనాలే ప్రాముఖ్యత పొందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.






