---Advertisement---

ఒకరు అలా.. మరొకరు ఇలా! నిర్ణేత మాత్రం ఓట‌రే

ఒకరు నమ్మకం అడుగుతారు.. మరొకరు గుర్తు చేస్తారు! తీర్పు మాత్రం ఓటరదే
---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ పథకాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు, నగదు హామీలు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలక ఆయుధాలుగా మారాయి. నెలకు ₹1500, ₹4000, ₹6000 వంటి ఆర్థిక సహాయ వాగ్దానాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రకటించబడుతున్నప్పటికీ, వాటి చుట్టూ జరుగుతున్న రాజకీయ వ్యాఖ్యలు మాత్రం ప్రజాస్వామ్య విలువలపై చర్చకు దారి తీస్తున్నాయి.

ఇటీవల బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమయ్యాయి. “ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ రేపు ఓటు వేయకపోతే మీకు మంచి జరుగుతుందా?” అనే భావంలో వచ్చిన మాటలు సంక్షేమాన్ని హక్కుగా కాకుండా ఉపకారంగా చూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెన్షన్ లేదా ఇతర పథకాలు పొందుతున్న ప్రజల ఆత్మగౌరవాన్ని ఇది దెబ్బతీస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమం అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకే తిరిగి వచ్చే నిధులు,అది దయా ధర్మం కాదు, పౌర హక్కు అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

దీనికి పూర్తి విరుద్ధంగా గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు వచ్చింది. “మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి, మీరే నిర్ణయం తీసుకోండి” అనే వినమ్ర పిలుపు ప్రజల తీర్పుపై నమ్మకం చూపించిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక నాయకుడు ప్రజలపై విశ్వాసం ఉంచి మాట్లాడటం, మరొకరు సంక్షేమాన్ని ఓటుతో ముడిపెట్టినట్టు వ్యాఖ్యానించడం ఈ రెండు శైలుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఓటు ప్రవర్తనలో “కృతజ్ఞత” కంటే “ఆశ” ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఒక నాయకుడు చేసిన సేవలకంటే భవిష్యత్తులో వచ్చే అవకాశాలపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడతారని వారు చెబుతున్నారు. తెలంగాణలో విస్తృత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం ఓడిపోవడం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ పథకాలు అమలు చేసిన ప్రభుత్వాలు కూడా తిరిగి అధికారంలోకి రాకపోవడం ఈ సిద్ధాంతానికి ఉదాహరణలుగా చూపిస్తున్నారు.

ప్రచార హోరు, భారీ హామీలు, చివరి నిమిషం వ్యూహాలు, ఇవన్నీ కలిసివచ్చినప్పుడు ప్రజల నిర్ణయం మారిపోవడం మన ప్రజాస్వామ్యంలో కొత్త విషయం కాదు. విశ్వసనీయత, ట్రాక్ రికార్డు, పాలన సామర్థ్యం వంటి అంశాల కంటే అప్పటి రాజకీయ వాతావరణం, భావోద్వేగాలు, ఆశలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

చివరగా.. మంచి జరిగిందని నమ్మితే ఓటు వేయమని చెప్పే రాజకీయ శైలి గానీ, సంక్షేమాన్ని గుర్తుచేసి ఓటు కోరే విధానం గానీ, ఏది ప్రజల మనసుకు దగ్గరగా ఉంటుందో తేల్చేది మాత్రం చివరకు ఓటరే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment