ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది తర్వాత కేబినెట్లో మార్పులు చేసే అవకాశముందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కేవలం కొత్త మంత్రిని చేర్చడం మాత్రమే కాకుండా, మంత్రివర్గంలో కొంతమందిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి ఇప్పటికే కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉండటంతో, పనితీరు ఆధారంగా మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. పనితీరు సంతృప్తికరంగా లేని వారికి అవకాశం తగ్గించి, కొత్త నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన జరుగుతోందని అంటున్నారు.
అలాగే కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ పార్టీలకు కూడా అదనపు ప్రాతినిధ్యం ఇవ్వాలా అనే అంశంపై చర్చలు జరిగే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి ఉగాది తరువాత ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గ మార్పులు కీలక చర్చగా మారే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.






