ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ పథకం తరహాలోనే ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల జీవన సౌలభ్యం కోసం “ఇంద్రధనస్సు” పథకంను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని మార్చి 18న ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని వేలాది మంది దివ్యాంగులకు పెద్ద ఊరట లభించనుంది.
ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే… ఇప్పుడు దివ్యాంగులకు కూడా
ప్రస్తుతం రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలుతో మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. గత ఏడాది ఆగస్టు నుంచి అమల్లో ఉన్న ఈ పథకం ద్వారా రోజూ లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో అదే తరహాలో దివ్యాంగులకు కూడా పూర్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.
మార్చి 18 నుంచి అమలు
ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మార్చి 18 నుంచి ఈ పథకం అధికారికంగా అమల్లోకి రానుంది. ఆ రోజున సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు క్రింది బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఇంతకు ముందు దివ్యాంగులకు బస్సు టికెట్లపై 50 శాతం రాయితీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం 100 శాతం రాయితీ ఇవ్వడంతో పూర్తిగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది.
అర్హతలు, అదనపు సౌకర్యాలు
ఈ పథకం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు వర్తిస్తుంది. అదనంగా.. దివ్యాంగుడితో పాటు ప్రయాణించే సహాయకుడికి టికెట్‌పై 50% రాయితీ ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని సాధారణ సేవల బస్సుల్లో ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల విద్య, వైద్యం, ఉద్యోగం వంటి అవసరాల కోసం ప్రయాణించే దివ్యాంగులకు గణనీయమైన సౌలభ్యం కలగనుంది.
సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ పథకం సరైన రీతిలో అమలైతే దివ్యాంగుల రోజువారీ జీవితంలో ప్రయాణం ఒక భారంగా కాకుండా సౌలభ్యంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగులకు ఇది నిజంగా ఉపయోగపడే సంక్షేమ చర్యగా నిలుస్తుందా లేదా అనేది అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుంది.








