రాష్ట్రంలో యోగా, నేచరోపతి విభాగ అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నేచరోపతి నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజును ఆ విభాగానికి సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదాతో పాటు హానరరీ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించారు.
జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మంతెన సత్యనారాయణ రాజు రెండు సంవత్సరాల పాటు ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. ఆయనకు అధికారిక వాహనం, కార్యాలయం, అవసరమైన సిబ్బంది సౌకర్యాలు కల్పించడంతో పాటు అధికారిక పర్యటనల కోసం ట్రావెల్ అలవెన్స్ కూడా అందించనున్నారు. ఈ నియామకానికి సంబంధించిన అన్ని పరిపాలనా చర్యలను చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర పోలీస్ శాఖలో కూడా ఒక కీలక నియామకం జరిగింది. ప్రస్తుతం అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న ఎన్. మధుసూదన రెడ్డిని రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారిగా నియమించారు. ఎన్నికల సమన్వయానికి సంబంధించి ఈ అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి జీఓ ఆర్.టి. నెం.519 విడుదలైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో సమన్వయం చేసేందుకు మధుసూదన రెడ్డి స్టేట్ పోలీస్ నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నియామకానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డీజీపీకి సూచనలు జారీ చేసింది.






