డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది మాదిరిగా పోరాడుతున్నారు” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించగా… అదే మాటను జగన్ రాజకీయంగా మలచి స్పందించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉత్కంఠగా మారుతోంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైయస్ జగన్ ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రిపోర్టర్ ప్రశ్నించగా, జగన్ వెంటనే తనదైన స్టైల్లో స్పందించారు.
“మేము కేవలం 11 మందే ఉన్నామే గానీ… 1100 మంది మాదిరిగా పోరాడుతున్నామని వాళ్లే చెబుతున్నారంటే, అది మా వాళ్లకు క్రెడిట్ ఇచ్చినట్టే కదా” అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో అధికార పక్షంపై విమర్శలు చేయడమే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేల పోరాటాన్ని కూడా హైలైట్ చేశారు.
ప్రస్తుతం అసెంబ్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిమిత సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై బలంగా గళం వినిపిస్తున్నారని జగన్ చెప్పే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పక్షం చేస్తున్న విమర్శలను తిరగదోడుతూ, అదే వ్యాఖ్యలను తన పార్టీకి అనుకూలంగా మలచడం ద్వారా జగన్ రాజకీయంగా మెసేజ్ ఇవ్వాలని చూశారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, జగన్ కౌంటర్ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






