---Advertisement---

బాలికలు, మహిళలపై పెరుగుతున్నఅత్యాచారాలు.. హత్యలు

బాలికలు, మహిళలపై దారుణాలు ఎందుకు ఆగడం లేదు..? ఆంధ్రప్రదేశ్‌లో భద్రతపై ముదురుతున్న అనిశ్చితి
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. చిన్నారుల నుంచి మహిళల వరకు ఎవరూ సురక్షితంగా లేరనే భావన ప్రజల్లో పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచారాలు, హత్యలు లా అండ్‌ ఆర్డర్‌పై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. కుటుంబాలు తమ పిల్లలను బయటకు పంపడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందని సామాజిక వర్గాలు చెబుతున్నాయి.

మదనపల్లి ప్రాంతంలోని నీరుగట్టువారిపల్లిలో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి డ్రమ్ములో దాచిన ఘటన ప్రజలను షాక్‌కు గురిచేసింది. బాలిక కనిపించడంలేదని కుటుంబ సభ్యులు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెను సురక్షితంగా గుర్తించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

గడిచిన 19 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది బాలికలపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు చిన్నారుల భద్రతపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశాయని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి.

బాధిత కుటుంబాలు పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యంపై ఆరోపణలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల ఫిర్యాదులు చేసినా తక్షణ చర్యలు తీసుకోలేదని, రాజకీయ ఒత్తిడులు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో బాధిత కుటుంబానికే ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపణలు రావడం వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

సామాజిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి ఘటనలు కేవలం నేరాల పరిమితిలోనే కాకుండా పరిపాలనా వైఫల్యాన్ని కూడా సూచిస్తున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత కోసం కఠిన చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేక వ్యవస్థ అవసరమని వారు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచడం, నేరస్తులకు తక్షణ శిక్షలు అమలు చేయడం ద్వారానే ఇటువంటి దారుణాలను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజు కొత్త ఘటన వెలుగులోకి రావడం సమాజానికి ప్రమాద సంకేతంగా మారింది. బాలికలు, మహిళలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, సమాజం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజా వర్గాలు కోరుతున్నాయి. భద్రత, న్యాయం, నమ్మకం ఈ మూడు అంశాలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment