రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అవసరాలు, పరిస్థితులు, సమీకరణాలు, ఇవే పార్టీ మార్పుల దారిని నిర్ణయిస్తాయి. అలాంటి రాజకీయ వాస్తవాల మధ్య ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. “మనం దగ్గర నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తామంటే చెప్పుతో కొడతాం” అన్న ఆయన మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
వైసీపీ సమావేశంలో మాట్లాడిన కేతిరెడ్డి, కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శత్రువుల్ని క్షమించవచ్చేమో గానీ, మనతో ఉండి మోసం చేసిన వారిని మాత్రం క్షమించరాదన్నారు. బంధుత్వం, స్నేహం పేరుతో తిరిగి పార్టీ గడప దాటాలనుకునే వారికి “గేటు వద్దే చెప్పు ముద్ర పడేలా చూస్తాం” అనే వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. పార్టీ పట్ల నిబద్ధతతో నిలిచిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఉండాలన్న ఆయన ఉద్దేశం స్పష్టమే అయినా, ఉపయోగించిన భాషపై మాత్రం అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలు కేవలం ఆవేశపు మాటలేనా అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా స్పష్టంగా లేదు. అయితే ఒక విషయం మాత్రం నిజం, రాజకీయాల్లో గోడమీద పిల్లులు లాంటి వాళ్లు చాలా మందే ఉంటారు. ఇది కొత్తేమీ కాదు.. ఇప్పటితో ఆగిపోదు కూడా. కాబట్టి రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది సర్వసాధారణం. ప్రజలు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవడం కూడా మానేశారు.






