రాష్ట్రంలో ఆదాయ వనరులు తగ్గడం, అప్పులు పెరగడం, సంక్షేమ హామీల అమలుపై అనిశ్చితి వంటి అంశాలు ఇప్పటికే చర్చ నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో ఫీజు చెల్లించిందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో కొత్త వివాదానికి దారి తీసింది.
ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులేమో కొండలా పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు ప్రభుత్వం మరోసారి సుమారు రూ.33 లక్షలు ఫీజుగా చెల్లించినట్లు సమాచారం. వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించేందుకు ఆయన సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు చెల్లించింది.
తాజా చెల్లింపుతో కలిపి మొత్తం సుమారు రూ.15 కోట్ల 23 లక్షల 50 వేలు చెల్లించారని సమాచారం. ఈ స్థాయి ఖర్చులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమా అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది. ప్రతిపక్షం ఈ కేసులను రాజకీయ కక్షసాధింపుగా విమర్శిస్తూ ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం న్యాయపరమైన పోరాటాల్లో అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించడం సాధారణమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఖర్చు చేయాల్సిందేనని సమర్థిస్తోంది.
అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, ప్రస్తుత నిర్ణయాలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. పెరుగుతున్న అప్పులు, తగ్గని ఖర్చులు, మరియు వివాదాస్పద చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.






