---Advertisement---

మాకు హామీలు కాదు.. నీళ్లు కావాలి

జంబులబండలో జల సంక్షోభం... హామీలు కాదు నీళ్లు కావాలని రోడ్డెక్కిన మహిళల ఆగ్రహం
---Advertisement---

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం జంబులబండ గ్రామంలో నెలలుగా కొనసాగుతున్న మంచినీటి ఎద్ద‌డిని పాల‌కులు ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆగ్ర‌హించిన మ‌హిళ‌లు మంచినీటి కోసం రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తాగునీరు కోసం రోజూ కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని ఆవేదనతో గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. గ్రామంలో బోర్లు ఎండిపోవడం, పైపులైన్ నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల కుటుంబాలన్నీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయ‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నెలలుగా బాధ… వినేవారు లేరు
మంచినీటి స‌మ‌స్య‌పై నెలల తరబడి అధికారులకు ఫిర్యాదులు చేసినా వాళ్లు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని గ్రామ‌స్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. “తాగడానికి చుక్క నీళ్లు లేవు… పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు… కానీ పట్టించుకునే నాథుడు లేడు” అంటూ కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. ధర్నా కారణంగా ప్రధాన రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవ‌డంతో సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా) అధికారులు అక్కడికి చేరుకుని మహిళలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే, సమస్య పరిష్కారం వరకు వెనక్కి తగ్గేది లేదని మహిళలు స్పష్టం చేశారు. “మాకు నీళ్లు కావాలి… హామీలు కాదు” అంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

నీటి సమస్యకు తక్షణ పరిష్కారం చూపే వరకు ధర్నా విరమించబోమని మహిళలు భీష్మించుకున్నారు. అవసరమైతే అరెస్టులకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఖాళీ బిందెలను రోడ్డుమధ్యలో పెట్టి కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. “ప్రత్యేక విమానాల్లో తిరిగే నాయకులకు మా బాధలు కనిపించవా?” అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment