శ్రీకాకుళం నగరం డయేరియా వ్యాప్తితో తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. దమ్మలవీధి, కాకివీధి, గోల్కొండరేవు, బోడెమ్మ కోవెల, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీల్లో పరిస్థితి విషమంగా మారింది. వాంతులు, విరేచనాలతో ప్రజలు ఆస్పత్రుల పాలవుతుండగా, ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలవపెడుతోంది. కలుషిత తాగునీటి సరఫరానే ఈ విషాదానికి ప్రధాన కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఒకవైపు ప్రజలు డయేరియాతో చనిపోతుంటే, మరోవైపు ప్రభుత్వం ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని మండిపడ్డారు. డయేరియా నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం, మరణాలకు వేరే కారణాలు చూపుతూ బాధ్యత తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా తాగునీటి సమస్యల వల్ల ప్రజలు మరణించడం పాలనలో వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కలుషిత నీటి సరఫరా వల్లే మరణాలు సంభవించాయని స్థానికులు, వైద్యులు చెబుతున్నా ప్రభుత్వం దాన్ని అంగీకరించడంలేదని విమర్శించారు.
గత 20 నెలల్లో రాష్ట్రంలో 61 డయేరియా ప్రబలిన ఘటనలు చోటు చేఉసుకున్నాయి. వాటిలో 35 ఘటనలు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. కలుషిత నీటి సమస్యపై ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి గురించి స్థానిక మీడియా ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, ప్రజాప్రతినిధులు స్పందించలేద వారు విమర్శిస్తున్నారు. మరణాల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం జరుగుతోందని కూడా ఆరోపించారు.
డయేరియాతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, బాధితులకు తక్షణ వైద్యసహాయం, శుద్ధమైన తాగునీటి సరఫరా, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం మాత్రం విస్మయాన్ని కలిగిస్తోంది.






