చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి రెండేళ్లు అవుతున్నా అమలు కాలేదు. తాజాగా ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ లో అయినా నిధులు కేటాయిస్తారనుకుంటూ అదీ లేదు. ఇక ఈ పథకానికి మంగళం పాడినట్లేనా? అనే అనుమానం అందరిలో కలుగుతోంది. అంతేకాదు ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కూడా దానిని కూడా అమలు చేయడం లేదు.
హామీలు ఏమయ్యాయి?
2023 మే 28న రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు యువతకు పెద్ద హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా, ఆ హామీల అమలు దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు.
మూడో బడ్జెట్‌లోనూ నిరుద్యోగుల ఊసే లేదు
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో వార్షిక బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన లోకేష్ ఇప్పటివరకు ఒక్క క్యాలెండర్ కూడా ప్రకటించకపోవడం దురదృష్టకరం. నోటిఫికేషన్లు, పరీక్షలు, నియామకాలు ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడం నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
రూ.21,600 కోట్ల ప్రశ్న
హామీ ప్రకారం 20 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటే, ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.36,000 అవుతుంది. రెండేళ్లకు అది రూ.72,000. 20 లక్షల మందికి కలిపితే దాదాపు రూ.14,400 కోట్లు అవుతాయి. తాజాగా బడ్జెట్‌లో భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో ఏడాదికి రూ.7,200 కోట్లు కూడా చెల్లించబడ ప్రరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా మూడు సంవత్సరాల్లో రూ.21,600 కోట్లు నిరుద్యోగులకు బాకీ పడ్డారు.
నోటిఫికేషన్లు, నియామకాలు ఎందుకు నిలిచిపోయాయి?
గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసిన లక్షలాది అభ్యర్థులు ఇంకా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తవాల్సిన నియామక ప్రక్రియలు ఎందుకు నిలిచిపోయాయి? 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్‌లో ఉండటానికి కారణం ఏమిటి? ఇప్పటికే ఖాళీలు ఉన్న శాఖల్లో భర్తీ చేయకుండా కొత్త పోస్టుల ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అంశాలుగా మారాయి.
నాడు ఉద్యోగాలు.. నేడు హామీలు
వైయస్ జగన్ పాలనలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ, ఆర్టీసీ విలీనం, ఇతర రంగాల్లో నియామకాలు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం హామీలు మాత్రం భారీగా ఉన్నాయి కానీ. ఉద్యోగాలు మాత్రం టార్చ్‌లైట్ పెట్టి వెతికినా కనిపించడం లేదు.






