---Advertisement---

విలువల రాజకీయాలకు ప్రతీక వైయస్ఆర్‌సీపీ

విలువల రాజకీయాలకు ప్రతీక వైయస్ఆర్‌సీపీ: వైయస్ జగన్
---Advertisement---

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ సీపీ ఒక్క వ్యక్తి పార్టీ కాదని, కోట్లాది మంది కార్యకర్తలు, అభిమానులు, వైయ‌స్ఆర్‌ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి కుటుంబానికి చెందిన పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ ముందుగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పదిహేనేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు. రాజకీయాల్లో విలువలు కనుమరుగవుతున్న సమయంలో విశ్వసనీయత, నిబద్ధతకు ప్రతీకగా ఈ పార్టీ పుట్టిందన్నారు. తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని పేర్కొన్నారు.

పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న పరిస్థితులను గుర్తుచేసుకున్న జగన్, ఆ రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లు, కుట్రలు, కుతంత్రాలు మధ్య కూడా వెనక్కి తగ్గలేదన్నారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నో అడ్డంకులు సృష్టించినా తాను భయపడలేదని చెప్పారు. తాను నమ్ముకున్నది పై ఉన్న దేవుడిని, కింద ఉన్న ప్రజలని మాత్రమే అని పేర్కొన్నారు.

ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల అండతోనే ఈ ప్రయాణం సాధ్యమైందని జగన్ అన్నారు. వైయ‌స్ఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి పనిచేసే పార్టీగా వైయ‌స్ఆర్‌ సీపీ ఎప్పటికీ నిలుస్తుందని చెప్పారు. తనతో కలిసి నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా “అదిగో మా నాయకుడు, ఇదే మా పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ” అని చెప్పుకునేలా పార్టీ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులకు జగన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment