రాష్ట్రంలో జరగబోయే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్) ప్రక్రియపై వైయస్ఆర్‌సీపీ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికార పక్షం చేసే అవకతవకలను అడ్డుకోవడంతో పాటు పార్టీకి చెందిన ఓటర్లను తొలగించే ప్రయత్నాలు ఎక్కడా జరగకుండా బూత్ స్థాయిలో పటిష్టంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జోనల్ ఇంఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా స్థాయి బూత్ కమిటీల అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, దాని ప్రభావం, అధికార పార్టీ నుంచి జరిగే అవకాశమున్న అక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఎన్నికల ప్రక్రియలో బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నేపథ్యంలో అదే టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేసే అవకాశమూ ఉందన్నారు. అందువల్ల పార్టీ కార్యకర్తలు మరింత జాగ్రత్తగా పనిచేసి, నిజమైన ఓటర్లను కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా వైయస్ఆర్‌సీపీకి మద్దతుగా ఉన్న ఓటర్లను అక్రమంగా తొలగించే ప్రయత్నాలు జరగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
గతంలో 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఇంటింటి సర్వే పేరిట వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించిందని ఆయన గుర్తు చేశారు. అప్పుడు లక్షలాది ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని, ఆ పరిస్థితుల్లో పార్టీ తీవ్రంగా పోరాడాల్సి వచ్చిందని అన్నారు. అలాంటి పరిణామాలు మళ్లీ చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అనుమానాస్పద చర్యలు కనిపించినా వెంటనే స్పందించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సజ్జల అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాష్ట్రం నుంచి బూత్ స్థాయి వరకు టాస్క్‌ఫోర్స్ తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటుచేసి పనిచేయాలని సూచించారు. ఆ విధంగా అధికార పార్టీ చేసే అక్రమాలను అడ్డుకుని పార్టీ ఓటర్లను కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి కూడా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఓటరును పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చే బాధ్యతను పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని చెప్పారు. పార్టీకి ఇప్పటికే లక్షలాది మంది కార్యకర్తల నెట్‌వర్క్ ఉందని, వారందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కష్టపడితే మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందడం సాధ్యమని, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.






